Secondary Education: ఉన్నత చదువులకు పునాది మాధ్యమిక విద్య 1 y ago
సెకండరీ ఎడ్యుకేషన్ విద్యార్థులను ఉన్నత విద్య కోసం సన్నద్ధం చేసే ఒక బృహత్తర విధానం. విశ్వ విద్యాలయాలు, కళాశాలలు, వృత్తి విద్యా సంస్థల్లో ప్రవేశానికి, చదువులు అభ్యసించడానికి పునాది వేస్తుంది. విద్యార్ధి ఎంచుకున్న విభాగంలో మంచి నైపుణ్యాన్ని సాధించడానికి మాధ్యమిక ఎంతగానో దోహదం చేస్తుంది. బాల్యానికి, యుక్త వయస్సుకి మధ్య అంతరాన్ని తొలగిస్తుంది. మరింత అధునాతన విద్యా విషయాల కోసం అవసరమైన నైపుణ్యంతో విద్యార్థులను సన్నద్ధం చేస్తుంది.
భారతదేశంలోని మాధ్యమిక విద్యా విధానం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పరిధిలో నడుస్తుంది. సెకండరీ విద్య సాధారణంగా ఆరేళ్ల ప్రాథమిక విద్య తర్వాత ఉంటుంది. చాలా దేశాల్లో సెకండరీ విద్య తప్పనిసరి. విద్యార్థికి కనీసం 16 ఏళ్లు వచ్చే వరకు ఉంటుంది. 1929లో ది బోర్డు ఆఫ్ హైస్కూల్ అండ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్‌గా ప్రారంభమై.. 1962 సీబీఎస్ఈగా స్థిరపడింది.
అసలు మాధ్యమిక విద్య అంటే ఏంటీ..
తెలుగు రాష్ట్రాల్లో మాధ్యమిక విద్యను పాఠశాల విద్యాశాఖ, ఇంటర్మీడియట్ విద్యా మండలి నిర్వహిస్తాయి. ఉన్నత పాఠశాల విద్య (హైస్కూల్ ఎడ్యుకేషన్)లో 6 నుంచి 10వ తరగతులు నిర్వహిస్తారు. 11 నుంచి 16 సంవత్సరాల వయస్సు గల బాలబాలికలు ఉన్నత విద్య నభ్యసిస్తారు. జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాలల విద్యా శాఖ పర్యవేక్షణ చేస్తుంది. మాధ్యమిక విద్య ప్రాథమిక పాఠశాలలో పొందిన జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. మాధ్యమిక విద్య ప్రధాన లక్ష్యం గణితం, శాస్త్రాలు, భాషలు, మానవీయ శాస్త్రాలు వంటి ప్రధాన విషయాల్లో అధునాతన అధ్యయనాలను కలిగి ఉన్న విభిన్న పాఠ్యాంశాలను అందించడం. దీంతో ప్రత్యేకమైన అభ్యాసం, భవిష్యత్తు అవకాశాల కోసం విద్యార్థులను సిద్దం చేయడం దీని లక్ష్యం.
మాధ్యమిక విద్యా విధానంలో బోధన
భారత దేశంలో మాధ్యమిక విద్య కాల వ్యవధి నాలుగేళ్లు. IX-XII తరగతులు 14-18 ఏళ్ల మధ్యగల విద్యార్థులకు పాఠాలు బోధిస్తారు. ఈ పాఠ్య ప్రణాళిక ఆచరణాత్మకంగా ఉంటుంది. అలాగే కెరీర్ ఆధారితమైంది. ప్రాథమిక విద్యలా కాకుండా, మాధ్యమిక విద్యలో ప్రతి సబ్జెక్టు సమాన ప్రాధాన్యత ఉంటుంది.
ఇక XI, XII తరగతుల దశ విద్యార్థులకు చాలా క్లిష్టమైంది. ఎందుకంటే విద్యార్ధులు తమ అభిరుచులు, భవిష్యత్తు ప్రణాళిక ఆధారంగా సబ్జెక్టుల ఎంపిక ఎంచుకుంటారు. ఉపాధ్యాయులు భిన్నమైన బోధన విధానాన్ని ప్రదర్శిస్తారు. వక్తృత్వం, చర్చా వేదిక, ప్రదర్శనలతో తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. ఈ తరగతులకు బోధించడానికి ఉపాధ్యాయులు ప్రధాన సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ చదివి ఉండాలి. టీచర్లకు టీనేజర్ల మానసిక, భావోద్వేగ, అంశాలపై కూడా మంచి అవగాహన ఉండాలి.
జాతీయ విద్యా విధానం(NEP 2020) ఏం చెబుతోంది..
సున్నితంగా మెలగాలి: మంచి వాతావరణం నుంచి వచ్చిన పిల్లలు సత్ప్రవర్తనలో ఎటువంటి పరిస్ధితులనైనా విజయవంతంగా అధిగమిస్తారు. పిల్లలను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదే కీలక పాత్ర.
ఉద్దేశం: మాధ్యమిక విద్య ఉద్దేశం విద్యార్ధులకు సామాజిక, భావోద్వేగ నైపుణ్యాలను అభివృద్ధి చేయడం. విమర్శనాత్మక ఆలోచన వృద్ధి, సృజనాత్మకత, స్వాతంత్య్రాన్ని పెంపొందించడం లక్ష్యం.
ఉన్నత విద్యకు సన్నద్ధం: సెకండరీ విద్య విద్యార్థులను ఉన్నత విద్య కోసం సన్నద్ధం చేసేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. విశ్వ విద్యాలయాలు, కళాశాలలు, వృత్తి విద్యా సంస్థల్లో ఉన్నత చదువులకు పునాది వేస్తుంది. పునాదులు వేస్తుంది. అధునాతన విద్యా విషయాల కోసం అవసరమైన నైపుణ్యంతో విద్యార్థులను సన్నద్ధం చేస్తుంది.
మాధ్యమిక విద్య-సమస్యలు:
- చాలా రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో పాఠశాలల్లో తరగతి గదులు, ప్రయోగ శాలలు, లైబ్రరీలు, పారిశుద్ద్య అవసరాలు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేవు.
- శిక్షణ పొందిన, నాణ్యమైన ఉపాధ్యాయుల కొరత ఉంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో, విద్యార్థి - ఉపాధ్యాయ నిష్పత్తి విద్య నాణ్యతపై ప్రభావం చూపుతుంది.
- ఆర్థిక పరిమితులు, ముఖ్యంగా బాలిక విద్యపై సామాజిక నిబంధనలు మొదలైన వాటి కారణంగా ఎక్కువగా డ్రాపౌట్స్ ఉంటున్నాయి.
- మాధ్యమిక విద్యా విదానంలో పాఠ్య ప్రణాళిక థియరీ పరంగా చాలా ఎక్కువగాను, ప్రాక్టికల్ పరంగా తక్కువగానూ ఉంటుంది.
- అలాగే రోట్ లెర్నింగ్ (పదే పదే రీకాల్ చేయడం) ద్వారా అభ్యసన ఉంటుంది. కెమిస్ట్రీలో ఆవర్తన పట్టిక, గణితంలో గుణకార పట్టికలు, వైద్య శాస్త్రంలో శరీర నిర్మాణ శాస్త్రం, ఏదైనా శాస్త్రంలో ప్రాథమిక సూత్రాలు మొదలైన వాటిని రోట్ లెర్నింగ్ ద్వారా అభ్యసిస్తారు. నాణ్యమైన మాధ్యమిక విద్య ఇప్పటికీ సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందిన విద్యార్థులకు సరిగ్గా అందుబాటులో లేదు.
మాధ్యమిక విద్య కోసం ప్రభుత్వ కార్యక్రమాలు:
రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్(RMSA): మాధ్యమిక విద్యలో నాణ్యత, మెరుగుదలతో పాటు అందుబాటులోకి తీసుకురావడానికి 2009 నుంచి రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్(RMSA) ప్రారంభించబడింది. మౌలిక సదుపాయాల ఆధునీకరించడం, నమోదు చేసుకున్న ఉపాధ్యాయుల పెంపుదల, పాఠ్యప్రణాళిక సంస్కరణలు ఇందులో ఉన్నాయి.
బాలికలకు ప్రోత్సాహక జాతీయ పథకం(NSIGSE): మాధ్యమిక పాఠశాల స్థాయిలో బలహీన వర్గాలలోని బాలికలకు ప్రోత్సాహకాల రూపంలో ఆర్థి సాయం అందించడం కోసం జాతీయ ప్రోత్సాహక పథకాన్ని ప్రవేశ పెట్టారు.
వృత్తి శిక్షణ కార్యక్రమాలు
మాధ్యమిక విద్యా వ్యవస్థలో భాగంగా విద్యార్ధులకు సేవలందించడం, వారి అభ్యాసానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకునేలా చేయడం, సమాజంలో మరింత ఉపాధి పొందేలా వృత్తి శిక్షణ కార్యక్రమాలాంటివి ప్రభుత్వం చేపట్టింది.
పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు
పాఠశాలల్లో ప్రయోగశాలలు, లైబ్రరీలు, క్రీడా సౌకర్యాలు, ఐసీటీ ల్యాబ్‌లు వంటి మౌలిక సదుపాయాలను కల్పించడం ద్వారా విద్యా పరంగా అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తోంది.
మాధ్యమిక విద్యా సంస్ధల ప్రస్తుత స్ధితి
భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం దేశంలోని మాధ్యమిక, సీనియర్ మాధ్యమిక పాఠశాలలు సుమారుగా 2,50,000 కంటే ఎక్కువగానే ఉన్నవి. మాధ్యమిక విద్యలో స్థూల నమోదు నిష్పత్తి 79.6 శాతం, ఉన్నత మాధ్యమిక విద్యలో 2020-21లో 53.8శాతంగా ఉంది. అట్టడుగు వర్గాలకు చెందిన బాలికల్లో డ్రాపౌట్ రేటు ఎక్కువగా ఉంది.
సీబీఎస్ఈ కింద భారత దేశంలో 29,340, విదేశాల్లో 257 పాఠశాలలున్నాయి. ఇందులో 1,247 కేంద్రియ విద్యాలయాలు, 5,280 ప్రభుత్వ, ఎయిడెడ్, 22,408 స్వతంత్ర పాఠశాలలు, 648 జవహర్ నవోదయ విద్యాలయాలున్నాయి. అలాగే భారత్‌లో నివశిస్తున్న టిబెటన్ పిల్లల కోసం, వారి సంస్కృతి, సంప్రదాయల పరిరక్షణకు కేంద్ర మంత్రిత్వ శాఖ 14 సెంట్రల్ టిబెటన్ స్కూల్స్ నిర్వహిస్తోంది. దేశంలో మొత్తం 18 ప్రాంతీయ కార్యాలయలున్నాయి. అందులో ఒకటి విజయవాడలో ఉంది.